Suraparaju Radhakrishnamoorthy రాసిన అద్భుతమైన వ్యాసం, ఆయన వాల్ మీంచి షేర్ చెయ్యడంలో ఇబ్బంది ఉన్నందువల్ల ఇట్లా కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. రాధాకృష్ణమూర్తిగారూ, మన్నించగలరు. మిత్రులంతా చదవాలి కదా మరి!
________________________________
సత్యపరిశోధన
సూరపరాజు రాధాకృష్ణమూర్తి
________________________________
(ఇది ఫేస్ బుక్ లోని ఒక పోస్టు ఆధారంగా రాసింది.ఆ పోస్టు , scroll.in నుండి ఒక వ్యాసం. ఆ వ్యాసానికి ఆధారం ఒక మనోవైజ్ఞానికవిశ్లేషకుడు, Frank Erickson, రాసిన ఒక పుస్తకం:Gandhi's Truth:the emergence of militant non-violence.ఆ పోస్టు పై నా ఆలోచన కొంత.)
గాంధీ స్వీయచరిత్ర ' నా సత్య పరిశోధనలు' (My Experiments with Truth') అని తెలిసిందే.ఆ పరిశోధనలు ఎటువంటివి? ఒక ఉదాహరణ.
1918 ఆగస్టు లో గాంధీ తీవ్రంగా అస్వస్థుడైనాడు, ఏ పనులూ చేసుకోలేనంతగా నీరసపడిపోయాడు. తనను చావు సమీపిస్తోంది అన్న భావనకూడా కలిగింది, అన్నాడు కూడా దగ్గరివారితో. ఒక డాక్టరు పరీక్షచేసి, 'జబ్బేమీలేదు,నరాలు బలహీనమైనాయి,(nervous breakdown)అంతే', అన్నాడు. ఈ నాటి వైద్యులైతే ఆ స్థితిని depression అనేవాళ్ళు.నిజానికి నరాలనీరసం (nervous breakdown) మానసికవ్యాధి కాదు. అది ఒక తీవ్రమైన
అంతస్సంఘర్షణకారణంగా కలిగే ఒక విధమైన శారీరకమానసిక అశక్తత. ఏది చేయదగినదో నిర్ణయించుకోలేక,ఏమీ చేయని స్థితి.గాంధీకి ఈ స్థితి అయిదునెలలు అలాగే కొనసాగింది. ఆయన ఈ మనస్థితికి కారణమేమిటి? నిజంగానే ఆయనకు చావు అంత దగ్గరగా వచ్చిందా, లేక అది కేవలం ఆయన ఊహా? ఈ ప్రశ్నలు పక్కనపెట్టి, అసలు గాంధీకి ఈస్థితి కలగడానికి కారణమైన అంతస్సంఘర్షణ ఏమిటి, అన్నది అర్థం చేసుకోవడం అవసరం. 
1917 లో చంపారన్ (బీహార్)లో గాంధీ జరిపిన మొదటి సత్యాగ్రహం ( అప్పటికి 'సత్యాగ్రహం' అన్న పదం వాడుకలోకి రాలేదు) విజయం సాధించింది.బ్రిటిష్ ప్రభుత్వబలం అండగా అక్కడి భూస్వాములు కౌలుదారులను అనేకవిధాలుగా పీడిస్తున్నపుడు, గాంధీ అక్కడి పేదప్రజలకు అండగా నిలబడి, వారిని
సంఘటితం చేసి, భూస్వాముల అరాచకత్వాన్ని అరికట్ట గలిగాడు. అక్కడి ప్రజలకు 'బాపు' అయినాడు.'మహాత్ము' డైనాడు.ఈ విజయాన్ని సహించలేని బ్రిటిష్ ప్రభుత్వం గాంధీని అరెస్టు చేసింది. కాని ప్రజల ఆందోళనకారణంగా ఆయనను విడుదల చేయవలసి వచ్చింది. పేదవ్యవసాయదారుల కోరికలను అంగీకరించవలసి వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం మొదటిసారి ఒక మెట్టు దిగిరావలసి వచ్చింది.
రెండవప్రయోగం,మార్చి 1918, గుజరాత్ లోని ఖైరాలో. ఆ ప్రాంతంలో ఘోరమైన కరువు ఏర్పడింది. 
అక్కడి రైతులు గాంధీ నాయకత్వంలో ఒక తీర్మానం చేశారు. ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు ఒక్కపైసాకూడా కట్టము.ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా , చివరకు మా పొలాలు ,యితర ఆస్తులు స్వాధీనం చేసుకున్నా మేం ప్రతిఘటించం.' ఈ ప్రతిఘటన కూడా అనూహ్యంగా విజయవంతం అయింది.పన్నులు వసూలు చేయడం ఆపింది ప్రభుత్వం. సత్యాగ్రహం రాజకీయప్రయోజనాలు సాధించుకోడానికి ఒక ఆయుధంగా ఉపయోగించుకోవచ్చును అని జాతికి ప్రకటటించింది ఖైరా ఉద్యమం. కాని ఈ ఖైరాసత్యాగ్రహమే గాంధీకి ఒక అతితీవ్రమైన అంతస్సంఘర్షణకు కారణమైంది. 
మొదటిప్రపంచయుద్ధం ముగింపుదశలో, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంనుండిఅయిదులక్షలసైనికులనుసమీకరించవలెని నిశ్చయించుకుని, 1918 ఏప్రిల్ చివర, ఢిల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేసింది.అప్పటికి ఖైరాసత్యాగ్రహం ముగిసి నెల అయింది. గాంధీ ఆ సమావేశానికి హాజరుకావడమేకాక, అత్యాశ్చర్యకరమైన ఒక హామీ కూడా యిచ్చాడు బ్రిటిష్ ప్రభుత్వానికి.' నేను మీ సైనికసమీకరణాధికారిని అయివుంటే మీ పై మనుషులవర్షం కురిపించి ఉండేవాణ్ణి', అని. జర్మన్ రాక్షసబలానికి భారతీయులను బలి యివ్వడం ఏమి తెలివైననిర్ణయం, అని ప్రశ్నించారు చాలామంది. ఒక వైపు సత్యాగ్రహము, మరొక వైపు యుద్ధనినాదమా, అన్నారు కొందరు. అహింస పరమధర్మంగా నమ్మే గాంధీ తాను తీసుకున్న ఈ నిర్ణయానికి కారణాలు అనేకం చెప్పాడు. కొందరు సత్యాగ్రహాన్ని అసమర్థుల ఆయుధంగా అవహేళన చేస్తున్నారు. వారందరికీ సమాధానాలు చెప్పాడు గాంధీ. అహింస అంటే అవసరమైనచోట యుద్ధం చేయకూడదని కాదు. పైగా, హింస చేయలేనివాడు అహింసను పాటించలేడు. సత్యాగ్రహం దుర్బలుల ఆయుధం కాదు. అత్యంత బలంకలవారు మాత్రమే సత్యాగ్రహానికి సమర్థులు. యుద్ధంలో కంటే సత్యాగ్రహంలో ఎక్కువ ధైర్యం సాహసం అవసరం.ఇది ఆయన సమాధానంలో ఒక భాగం. మరొకటి. మన సైనికుల సహాయంతో బ్రిటన్ యుద్ధంలో విజయం పొందితే, అప్పుడు మన బలం బ్రిటన్ కు తెలుస్తుంది.దానితో స్వాతంత్ర్యపోరాటంలో మన మాటకు బలం పెరుగుతుంది. 
కాని యిక్కడే గాంధీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.సైన్యంలో చేరండి అన్న పిలుపు వినగానే ఆయనను వినడానికి వచ్చిన వేలమంది,మెలిమెల్లిగా ఎక్కడివారక్కడ జారుకున్నారు. సైన్యంలో చేరడానికి లక్షలు కాదు వందమంది కూడా ముందుకు రాలేదు.నెల క్రితం తనమాటను మన్నించి , తమ ఇళ్ళూ వాకిళ్ళూ పొలాలు అన్ని విధాల ఆస్తులు గడ్డిపరకతో సమానంగా పరిత్యజించినవారు, ఈ నాడు యిలా తన మాటను పాటించకపోవడం ఎలా అర్థం చేసుకోవాలో ఆయనకు తెలియలేదు.జనం తన అహింసావాదాన్ని ఈ యుద్ధప్రతిపాదనతో సమన్వయం చేయలేకనా? కాని గాంధీకి అర్థమయింది.జనం విముఖతకు కారణం వారి అహింసాతత్వంకాదు. చంపడం యిష్టంలేకకాదు, చావడం యిష్టం లేక. సత్యాగ్రహం పిరికివారి మార్గం,బలహీనుల ఆయుధం అన్న విమర్శను యిన్నాళ్ళు తిప్పికొడుతూ వచ్చిన గాంధీ తన సత్యాగ్రహ నిజరూపం చూచి నిర్ఘాంతపోయాడు.ఈ పిరికిజనానికా నేను సత్యాగ్రహం చెబుతున్నాను, అనుకున్నాడు. 
ఈ ప్రతిఘాతంనుండీ కోలుకోడానికి పూర్తి అయిదునెలలు పట్టింది.తన రాజకీయజీవితంలో అతి పెద్ద అయోమయస్థితిని, అతితీవ్రమానసికసంఘర్షణను గాంధీ ఎదుర్కొన్నాడు.
ఆ దెబ్బకు విరేచనాలంటుకున్నాయి.నిస్సత్తువ.నిశ్చేష్టత. కోలుకోడానికి పూర్తి అయిదునెలలు పట్టింది.కోలుకోగలనన్న ఆశకూడా వదిలేశాడు.పటేల్ ఒక డాక్టర్ ను తీసుకొచ్చాడు.
డాక్టరు పరీక్షించి, 'ఏ జబ్బూ లేదు.నీరసం.కోలుకోవాలి అంటే పాలు తీసుకోవాలి' అన్నాడు. 'పాలుతాగను. అది నా వ్రతం' అన్నాడు గాంధీ.అక్కడే ఉండిన కస్తూరి బా అన్నది,' ఆవుపాలుకదా తాగననుకున్నావు.మేకపాలు తాగొచ్చు కదా?' అన్నది.గాంధీ సరే అన్నాడు.
మేకపాలు కొద్దిగా ఒంటబట్టినతరువాత గాంధీకి గొప్ప జ్ఞానోదయం అయింది. సైన్యంలో చేరండి అన్న తన పిలుపును జనం ఎందుకు వినిపించుకోలేదో యిప్పుడు అర్థమయింది.తను మేకపాలు తీసుకోడానికి ఎందుకు ఒప్పుకున్నాడో, జనం యుద్ధం చేయడానికి అందుకే ఒప్పుకోలేదు. మృత్యుభయం. పాలు తీసుకోను అన్న తన వ్రతంలో, మేకపాలు లేదు. నిజమే. కాని, వ్రతపరమార్థమదేనా? ఈ సత్యం ఎప్పుడు తెలుస్తుంది? తనదాకా వచ్చినపుడు ఆచరణలో తెలుస్తుంది.సిద్ధాంతం చేసినపుడు కాదు.
అయితే యిపుడేం చేయాలి? చావంటే భయపడేవాడికి సత్యాగ్రహం బోధించలేవు.హింసచేయలేనివాడికి అహింస బోధించలేము అని అనుకున్నాడు.మూగవాడికి మౌనప్రాధాన్యం ఏం చెప్పగలవు? అంటే, అందరికీ తుపాకులిచ్చి, చంపడంలో శిక్షణ యివ్వాలా? అందరినీ శాండోలుగా తయారుచేయాలా? కాదు.హింసాప్రవృత్తిని అహింసామార్గంలో వినియోగించుకోవాలి. వీరందరినీ యుద్ధానికి సన్నద్ధులను చేయాలి.ఎలాంటి యుద్ధం? ఒక పక్షం ఆయుధాలతో యుద్ధం చేస్తుంది.రెండవ పక్షం ఆయుధాలు లేకుండా యుద్ధం చేస్తుంది. ఒక్క శ్రీకృష్ణుడు మాత్రమేకాదు, అర్జునుడుకూడా ఆయుధాలుపట్టకుండా యుద్ధం చేస్తాడు! చరిత్రలో కాదు, సృష్టిలో యింతవరకూ ఎవరూ కనీవినీ ఎరుగని యుద్ధం! ఆ యుద్ధానికే సన్నద్ధం చేశాడు జాతిని.రౌలత్ చట్టాన్నివ్యతిరేకిస్తూ నడిపిన ఉద్యమమే ఆ యుద్ధం. ఆ తరువాత చరిత్ర ఎలా నడిచిందో, గాంధీ ఎలా నడిపించాడో తెలిసిన విషయమే. 
ఇక్కడ కొన్ని ప్రశ్నలు. గాంధీ మేకపాలు తీసుకోడానికి ఒప్పుకోడం ధర్మమా అధర్మమా? పదాన్ని గ్రహించి పరమార్థాన్ని వదిలేయడం కాదా? షేక్స్పియర్ నాటకంలో ఆంటోనియో ప్రాణాలు కాపాడడం కోసం పోర్ష్యా వాదం యిటువంటిదే అని మనకు తెలుసు. ' ఒప్పందంలో ఒక పౌండు మాంసమనే ఉంది, రక్తప్రసక్తి లేదు ', అని వాదించి కదా ఆమె షైలాక్ ను ఓడించింది? అది న్యాయమా? 
హిరణ్యకశిపుడు వరమడగడంలో వదిలేసిన లా పాయింటు మీదనే కదా స్వామి అతన్ని చీల్చివేశాడు,పోర్ష్యా షైలాక్ వాదాన్ని చీల్చినట్టు? హిరణ్యకశిపుడు అంత సుదీర్ఘము తీవ్రము అయిన తపస్సు చేసి ఆ అలసటలో వరమడగడంలో తడబడ్డాడు,పాపం. అతడు కోరినది పరమాత్మనైన నాకు తెలుసుకదా, అనుకున్నాడా?ఆ లా పాయింటుమీదనే కదా చంపేశాడు ? ఏది న్యాయం ? ఏది అన్యాయం? 
ధర్మం నిలపడం కొరకు ఏం చేసినా న్యాయమే, అని సమాధానం చెప్పుకోవచ్చు. కాని అన్ని ప్రశ్నలకు అతిస్పష్టమైన సమాధానాలుంటాయి అనుకోడం కూడా సరి అయిన సమాధానం కాదు.మనిషి బుద్ధికి అందనివి చాలా ఉన్నాయి అని తెలుసుకొని సమాధానపడడం అత్యుత్తమమైన ఎరుక.అయితే, ధర్మసందేహం కలిగినప్పుడు ఏమిటి ఆశ్రయం? బుద్ధి కాదు , హృదయమే ఆశ్రయం.
గాంధీ అదే అన్నాడు: 'ఇది ధర్మమా అధర్మమా అన్న సందేహం కలిగినపుడు, నీవు అడగవలసిన ప్రశ్న ఒకటే.ఈ పని వలన లాభం నాకా లోకానికా? స్వలాభం కొరకైతే అది నిస్సందేహంగా అధర్మమే.'